తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు వెయ్యి కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 42,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. దానిలో 925 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,62,653 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

శుక్రవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1,426కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,367 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,49,157కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 9,714 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 50,92,689కి చేరిందని అధికారులు చెప్పారు.

ఆ మధ్య రాష్ట్రంలో కాస్త కరోనా కేసులు సంఖ్య బాగా తగ్గిందని.. మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. దీంతో.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.