తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు టీఆర్‌ఎస్ అధికారం చేపట్టింది. మరోసారి అధికారం చేపట్టే దిశగా టీఆర్‌ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సీఎం కేసీఆర్ పలు అంశాల వారీగా సర్వేలు చేయిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు టీఆర్‌ఎస్ అధికారం చేపట్టింది. 2014తో పోలిస్తే.. 2108లో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ పెరిగింది. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టే దిశగా టీఆర్‌ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సీఎం కేసీఆర్ పలు అంశాల వారీగా సర్వేలు చేయిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ బృందం చేపట్టిన ఓ సర్వేలో.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. టీఆర్‌ఎస్ అధిష్టానానికి పీకే టీమ్ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌లో.. పార్టీ వైఖరిపై ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నట్టుగా తేలింది. 

2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగారు తెలంగాణ నినాదంతో ముందుకు సాగారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు చోటుచేసుకున్నాయి. 2018 ఎన్నికల తర్వాత ఇదే విధమైన చేరికలు కొనసాగాయి. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి.. ఉద్యమ కాలంలో ఉన్నవారితో పోల్చితే ఎక్కువ పదవులు దక్కాయి. ఉద్యమ సమయంలో.. కష్టకాలంలో పార్టీతో నడిచివారికంటే కొత్తగా వచ్చినవారికే గులాబీ బాస్ కేసీఆర్.. ప్రాధాన్యం ఇవ్వడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిగా భావించిన సొంత పార్టీలోనే గుర్తింపు దక్కడం లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక,గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌పై ఇదే రకమైన విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు విలువ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. తొలి నుంచి టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రయాణం సాగించి.. బయటకొస్తున్న నేతలు కూడా ఇలాంటి విమర్శలు చేయడం చూస్తునే ఉన్నాం. ఉద్యమ కాలంలో కష్టపడినవారికి కాకుండా.. బయటి నుంచి వచ్చినవారికే పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. అయితే ఈ పరిణామాలు భవిష్యత్లు రాజకీయాలపై ప్రభావం చూపకుండా టీఆర్‌ఎస్ అధిష్టానం చర్యలు చేపట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక, తెలంగాణలో ప్రభుత్వం పథకాల అమలుపై జనాల్లో స్పందన, పార్టీలో అసంతృప్తులు, ఉద్యమకారులు.. ఇలా పలు అంశాలపై కేసీఆర్‌ ఆదేశాల మేరకు పీకే టీమ్ రంగంలోకి దిగి సర్వే చేపట్టాయి. ఉద్యమకారుల విషయానికి వస్తే.. వారు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, పదవులు దక్కకపోవడంపై వారి అభిప్రాయం, పార్టీలో న్యాయం జరిగిందా.. వంటి విషయాలపై పీకే టీమ్ సమాధానాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం పలుచోట్ల పీకే టీమ్.. వారి నుంచే వివరాలు సేకరించినట్టుగా సమాచారం. అయితే ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఉద్యమ కాలంలో కేసులు ఎదుర్కొని.. ఇప్పుడు ఎలాంటి న్యాయం కొందరు నేతలు పార్టీ అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం ఇలాంటి వారు కొందరు పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదని.. పార్టీ తమ కోసం ఏమి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా సర్వేలో తేలింది. కనీసం తమను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని అసంతృప్తితో ఉన్న ఉద్యమకారుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో కీలక నాయకులు.. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసినవారిని పట్టించుకోవడం లేదని పీకే టీమ్ తన రిపోర్ట్‌లో పొందుపరిచినట్టుగా సమాచారం. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను టీఆర్‌ఎస్ అధిష్టానానికి అందజేసినట్టుగా తెలుస్తోంది.