హైదరాబాద్: ఆయన మైక్ పట్టారంటే చాలు ప్రతిపక్షాలను ఒక రేంజ్ లో ఆడేసుకుంటారు. రాష్ట్రస్థాయి నేతల దగ్గర నుంచి జాతీయ స్థాయి నాయకులను ఒకరేంజ్ లో ఆడిపోసుకుంటారు. స్వరాష్ట్రమైన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే కీలక వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ దుమారం రేపుతారు. 

అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. నోరు విప్పితే ఏదో ఒక సన్సేషన్ సృష్టించే ఆ మంత్రిగారు చాలా కూల్ గా మాట్లాడటం అంతా చర్చనీయంశంగా మారింది. ఎన్ని ప్రశ్నలు వేసినా బయట వాతావరణం బాగోలేదు తానేమీ మాట్లాడబోనని మీడియాకు దండం పెట్టేశారు. ఇంతకీ అంతలా మారిపోయిన ఆ మంత్రి ఎవరనుకుంటున్నారా....? ఇంకెవరు తలసాని శ్రీనివాస్ యాదవ్. 

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మీడియా మిత్రులు అడిగితే తాను చెప్పాల్సింది చెప్పారే తప్ప ఒక్క మాట కూడా దాటలేదు. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 

త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే రెండు సీట్లు అదనంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు. 

జీహెచ్‌ఎంసీ విభజనపై ఎలాంటి ఆలోచన, చర్చ లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఇప్పడున్నట్లుగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీకి గ్రౌండ్ లెవెల్ లో అంతగా పట్టులేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరికీ అసంతృప్తి లేదని అదంతా మీడియా సృష్టేనని చెప్పుకొచ్చారు. 

పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే వెళ్లి వాళ్లను అడగాలని తనకు తెలియదంటూ సమాధానం ఇచ్చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో సరదాగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. 

మైనంపల్లితో రెండు మూడు గంటలు తాను మాట్లాడానని అందులో తప్పేముందని నిలదీశారు. మంత్రిగా తనకు గతంలో టీడీపీలోనూ స్వేచ్ఛ ఉందని ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కూడా స్వేచ్ఛ ఉంటుందని చెప్పుకొచ్చారు.  

ఇకపోతే ఏపీ రాజకీయాలపై తానేమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. ఏపీలో నేతలు వాళ్లపని వారు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబులా ప్రతి దానికి టెన్షన్ పడే వాతావరణం తెలంగాణలో ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.