CM Revanth VS Kishan Reddy:కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. 

CM Revanth VS Kishan Reddy: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి (Kishan Reddy)ని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy)తీవ్రంగా స్పందించారు. చట్టాల పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరమని విమర్శించారు. కిషన్ రెడ్డి ముందు చట్టం చదవాలనీ, రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ ఉండదనే విషయం కూడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. దీన్ని బట్టి బీజేపీ నాయకులకు ఎంతటి అవగాహన ఉందో అర్థం అవుతుందని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇవాళ(గురువారం) ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో పేర్కొన్న "కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు" ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఆ 10 శాతం కొత్త రిజర్వేషన్ల వెనుక మీ కుట్రలే ఉన్నాయంటూ విమర్శించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీ ఈ (BC-E)వర్గానికి ఇప్పటికే 4 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్నదని తెలిపారు. ఆ 4 శాతం ముస్లింలకు ఇవ్వడంపై గతంలోనే చట్టపరంగా పరిష్కారం జరిగిందని గుర్తుచేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం తాము పోరాడుతామని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.

బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. సాయంత్రం వరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం వేచిచూస్తామని, అపాయింట్‌మెంట్ రాకపోతే ప్రధాని మోదీ ఒత్తిడి ఉన్నట్టేనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 42% రిజర్వేషన్ల అమలే లక్ష్యమని, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తాము నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. ఇవాళ(గురువారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటులోని మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గేతో రేవంత్‌రెడ్డి చర్చించారు. పలువురు మంత్రులతో కలిసి చర్చించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడిక్కిస్తున్నాయి.