ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. రేపు కవితను అరెస్ట్ చేసే అవకాశం వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఆయన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారని.. ప్రజల కోసం కడుపు కొట్టుకుని పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. రేపు కవితను అరెస్ట్ చేసే అవకాశం వుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోని.. అందరినీ వేధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భయపడేది లేదు.. పోరాటం ఆపేది లేదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామన్నారు.
బీజేపీలో చేరని వారిని వేధిస్తున్నారని.. కవితను కూడా చేరమన్నారని సీఎం పేర్కొన్నారు. మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారని కేసీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కేంద్రం వేధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను .. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. బీజేపీ వేధింపులను తిప్పికొడదామన్న ఆయన.. ఆ పార్టీని దేశం నుంచి పారద్రోలుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓర్వలేకపోతోందని.. ఆ పార్టీ చేతకానితనం బయట పడుతోందనే ఈ కుట్రలు చేస్తోందన్నారు.
