కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఉపాధి లేక తినడానికి తిండి లేక వలస కూలీలు పడిన బాధ వర్ణనాతీం.

ఈ క్రమంలో వారు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. అయితే కొందరు మాత్రం ఉపాధి కోసం తిరిగి వలస బాటపడ్డారు. తాజాగా బీహార్ నుంచి 225 మంది వలస కూలీలు తెలంగాణకు తిరిగి వచ్చారు.

Also Read:వలస కార్మికులకు కరోనా... రాష్ట్రాలకు తలనొప్పి

బీహార్‌లోని ఖగారియా నుంచి ప్రత్యేక శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ పర్యవేక్షించారు.

తిరిగి వచ్చిన వలస కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. హైదరాబాద్‌కు వచ్చిన వలస కూలీలు ప్రదానంగా రైస్ మిల్లులలో పనిచేయడానికి వచ్చారని గంగుల కమలాకర్ తెలిపారు.

Also Read:కేసీఆర్ సర్కార్ నిర్ణయం.. మాస్క్ లేకుండా బయట అడుగుపెట్టారో...

దీనిలో భాగంగా వీరిని నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి,  జగిత్యాల, పెద్దపల్లి,  సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేటలకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. ఈ సందర్భంగా కూలీలకు వాటరు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు అందజేశారు.