ప్రేమ పెళ్లి చేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించిన కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శరణ్య తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. కుమార్తె మరణానికి అల్లుడే కారణమని ఆరోపించిన వారే.. ఆమె భర్త చేతే అంత్యక్రియలు నిర్వహించారు.

కామారెడ్డికి చెందిన శరణ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన, తన క్లాస్‌మేట్ అయిన రోహిత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ బెంగళూరులోనే నివసిస్తున్నారు.

అయితే పెళ్లయిన కొద్దిరోజుల నుంచి రోహిత్ ప్రతిరోజూ మద్యం సేవిస్తూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో శరణ్య పుట్టింటికి వచ్చేసింది. భార్య కోసం కామారెడ్డి వచ్చిన రోహిత్.. ఇకపై బాగా చూసుకుంటానని పెద్దలకు హామీ ఇచ్చి తిరిగి బెంగళూరు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఈ నెల 7న శరణ్య బలవన్మరణానికి పాల్పడింది.

కరోనా సమయంలోనూ బెంగళూరు నుంచి తల్లిదండ్రులు శరణ్య మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకొచ్చారు. పెద్ద మనసు చేసుకుని ఎలాంటి బేషజాలకు పోకుండా భర్త రోహిత్ చేత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు  నిర్వహించారు.

అల్లుడి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించిన వారే.. గొడవలు పక్కనబెట్టి సంప్రదాయాలను పాటించారు. దీంతో వారి వ్యక్తిత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.