త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. పాత పద్ధతి డీఎస్సీ ద్వారానే త్వరలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే భావించాలి. 

దేశంలోనే మొదటిసారి వర్క్ షీట్స్ పెట్టిన ఘనత తెలంగాణాకే దక్కుతుందని మంత్రి అన్నారు. టి-సాట్ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. 

విద్యార్థులకు ప్రభుత్వం 85 శాతం డిజిటల్ స్టడీని అందిస్తోందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. డిజిటల్ పాఠాలు పిల్లలకు అందించిన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిదిగా తెలంగాణ నిలిచిందన్నారు.

హైదరాబాద్ నగరంలో వరదల్లో సర్టిఫికెట్స్ నష్టపోయిన పిల్లలకు మళ్ళీ కొత్తవి అందించామని.. కరోనా ప్రభావం ఇంకా రాష్ట్రంలో కొనసాగుతోంది. కరోనా వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కాకుండా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కస్తూర్బా గురుకురాల్లో కోర్సులు పెంచి.. ఇంటర్ వరకు చదువుకునే వెసులుబాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు, డిగ్రీ కాలేజీలకు కావాల్సినన్ని నిధులు ప్రభుత్వం ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్స్ నియామకం త్వరలోనే ఉంటుందని సబిత సంకేతాలిచ్చారు.