కొత్తగూడెం: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు అపర కీచకుడిగా మారాడు. పాఠాలు చెబుతానని పిలిచి బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్ాల లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామ పరిధిలోని చింతవర్రెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 

వారిలో ఐదుగురు బాలికలున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డే సునీల్ కుమార్ వారిపై కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిచాడు. దాంతో బాలికలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 

అయితే, లైంగిక దాడి చేయడం వల్ల ఓ బాలిక ఆస్పత్రి పాలైంది. ఆ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి వారు సునీల్ కుమార్ ను నిలదీశారు. మరో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రెండు రోజుల పాటు ఆ విషయంపై పంచాయతీ చేశారు. 

ఆ విషయం బయటకు తెలియడంతో గ్రామస్తులందరూ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీవో రామారావు, సీడీపీపీఓ కనకదుర్గ, సీఐ గురుస్వామి, ఎస్సై అంజయ్య, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

గ్రామస్తులతో, తల్లిదండ్రులతో మాట్లాడారు. పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు డీఈవో సోమశేఖర శర్మ ప్రకటించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.