విధి నిర్వహణలోనే ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే. నారాయణపేట జిల్లా వోట్కూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ హైమద్‌ (38) వికారాబాద్‌ పట్టణంలోని శివారెడ్డిపేట మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు .

గత నవంబర్‌ నుంచి ఇక్కడ ఉర్దూ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు కొడంగల్‌ గురుకుల పాఠశాలలో పనిచేశారు. విధుల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి ఓ ఉపాధ్యాయుడు విధుల్లో ఉంటారు.

దీనిలో భాగంగా హైమద్‌ గత శుక్రవారం రాత్రి  9.30 గంటల ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొద్దిసేపటి తర్వాత బాత్రూంకు వెళ్లారు. ఆయన ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విద్యార్ధులు కంగారుపడి సెక్యూరిటీ గార్డుకు విషయం చెప్పారు.

ఆయన సహాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా హైమద్ కుప్పకూలి ఉన్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించి 108లో వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందారని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.