హైదరాబాద్‌: ఇటీవలే మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జైపాల్ మరణించిన రోజు చంద్రబాబు విదేశాల్లో ఉన్నారు. 

విదేశాల నుంచి శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు మధ్యాహ్నాం జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఈ సందర్బంగా జైపాల్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. జైపాల్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. 

దివంగత సీఎం ఎన్టీఆర్‌ను బర్తరఫ్‌ చేస్తే ఉద్యమానికి సారథ్యం వహించారని తెలిపారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో జైపాల్‌రెడ్డితో కలిసి తాను పనిచేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పేవ్యక్తి జైపాల్ రెడ్డి అని  కొనియాడారు.  

జైపాల్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్ రమణలు పరామర్శించారు. అనంతరం చంద్రబాబు అక్కడ నుంచి నేరుగా తన నివాసాని వెళ్లిపోయారు.