కూకట్ పల్లి: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజాకూటమిని గెలిపించాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి, మేనకోడలు నందమూరి సుహాసినికి మద్దతుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

 తెలుగుదేశం పార్టీపైనా తనపైనా విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పనేంటని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుందని ఈ సభ చూస్తే తాను ఎందుకు వచ్చానో ఏం పనుందో తెలుస్తుందని స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టింది తెలంగాణలోనేనని గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో తనకు పెత్తనం చెయ్యాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తాను దూరదృష్టితో ఆలోచించి తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.  

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నాకున్న స్థానాన్ని చెరపలేరని చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ నిర్మించింది తానేని, హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్ కు ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకువచ్చింది కూడా తానేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీకి కంచుకోట కూకట్ పల్లి నియోజకవర్గమని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు మున్సిపాలిటీ నీళ్లు కూడా వచ్చేవి కావన్నారు. అలాంటి కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పక్కనే హైటెక్ సిటీని నిర్మించానని అటువైపు మలేషియన్ టౌన్ షిప్ ఇక తాగేందుకు కృష్ణా నీళ్లు తీసుకువచ్చానని గుర్తు చేశారు.

హైదరాబాద్ నా మానసిక పుత్రిక అని చంద్రబాబు చెప్పకొచ్చారు. సైబరాబాద్ నగరాన్ని అంచెలంచెలుగా అభిృద్ధి చేసి ప్రపంచానికి తీసుకువచ్చానని తెలిపారు. సైబరాబాద్ నిర్మాణంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమేయం కానీ కేటీఆర్ ప్రమేయం కానీ లేదన్నారు. 

తాను చేసిన అభివృద్ధిని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అడ్డుపెట్టకుండా అభివృద్ధి చేసిందని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం అడ్డుపెట్టాడని కూకట్ పల్లి మెట్రో రైలుకు అడ్డుపెట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. హైదరాబాద్ తనకు నచ్చిన నగరమని చంద్రబాబు చెప్పారు. చేతుల్లో ఫైల్స్ పట్టుకుని ప్రపంచమంతా తిరిగానని ఫలితంగానే కంపెనీలు వచ్చాయన్నారు. 

నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క ఫ్లై ఓవర్ అన్నా నిర్మించావా అని నిలదీశారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అనేక ఐటీ కంపెనీలు తీసుకు వస్తే నువ్వు చేసింది ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు తాను సంపద సృష్టిస్తే కేసీఆర్ ప్రజల సొమ్ముతో ఇళ్లు కట్టుకున్నారన్నారు. 

నాలుగేళ్లలో కేసీఆర్ చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అంటూ నిలదీశారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ సాధించిన రెండే రెండు ఘనతలు ఒకటి ప్రగతి భవన్, మరోకటి ఫాంహౌస్ నిర్మించుకోవడం తప్ప అన్నారు. 

దేశం, తెలంగాణ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. మోదీ, షాల జోడీ చాలా భయంకరమైనదిగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశాన్ని భ్రష్టుపట్టించింది మోదీ షాలేనని చెప్పుకొచ్చారు. పెద్దనోట్ల రద్దు ఒక తప్పిదమని జీఎస్టీ వల్ల చిరు వ్యాపారస్థులు దెబ్బ తిన్నారని చెప్పారు. మోదీ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు.

తన ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ఇచ్చానని మోదీ ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చారా అంటూ మండిపడ్డారు. మోదీ హయాంలో ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని ధ్వజమెత్తారు. తెలుగుజాతికి, తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసింది మోదీ, షాలేనని ఆరోపించారు. 

ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ఆ తర్వాత  వచ్చిన మోదీ అమలు చెయ్యలేదని దుయ్యబుట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పిన టీఆర్ఎస్ యూ టర్న్ తీసుకుందని మండిపడ్డారు.  

రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని నిలదీస్తే తనకు పరిపక్వత లేదు కేసీఆర్ కు ఉందంటూ కితాబులు ఇస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 1995లో సీఎం అయ్యానని, 1983లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. మోదీ సీఎం అయ్యింది 2001లో అని అయితే ఎవరికి పరిపక్వత లేదో తెలుసుకోవాలన్నారు.

రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ అయితే ఆయనతో లాలూచీ పడింది కేసీఆర్ అని చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని మోడీ అయితే తెలంగాణలో కేసీఆర్ జూనియర్ మోడీ అంటూ వ్యాఖ్యానించారు. మోడీ  తెలంగాణకు ఏ పనిచెయ్యలేదని కేసీఆర్ కు తప్ప అంటూ విమర్శించారు. సీబీఐ ఎంక్వైరీలో కేసీఆర్ ను తప్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. 

దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం 37 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నామన్నారు. ప్రజాకూటమికి అర్థం లేదన్నారని ఇప్పుడు ఓడిపోతామని టీఆర్ఎస్ లో భయం పట్టుకుందన్నారు. రకరకాల మేనిఫెస్టోలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది టీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. 

తెలంగాణకు తాను అడ్డుపడ్డానని చెప్తున్నాడని ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు అంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ లేడు, టీఆర్ఎస్ లేదన్నారు. టీడీపీలో నాతోపాటే కలిసి పనిచేసిన ఆయన నువ్వెక్కడికి వచ్చావ్ ఎందుకు వచ్చావ్ అని నిలదీస్తున్నాడని చాలా బాధాకరమన్నారు. 

అయినా తాను బాధపడనని చెప్పుకొచ్చారు. 2004లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టున్న కేసీఆర్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడని తెలిపారు. కేసీఆర్ వల్లే  2009లో ఓడిపోయామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. 

సీనియర్ నాయకుడిగా దేశాన్ని రక్షించుకోవాలన్న బాధ్యత తనపై ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. తనకు 1996లోనే ప్రధానిగా అవకాశం వచ్చిందని ఆ తర్వాత కూడా వచ్చిందని అయినా తాను అంగీకరించలేదన్నారు. మెుదటి సారి వచ్చినప్పుడు సైబరాబాద్ నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. 

హైదరాబాద్ ను ఎవరైనా కొనియాడుతుంటే మెుదట సంతోషపడేది తానేని చంద్రబాబు చెప్పారు. హైటెక్ సిటీలో బిల్ క్లింటన్ వచ్చి సైబరాబాద్ నామకరణం చేసిన రోజు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను నిర్మించిన సైబరాబాద్ రాష్ట్ర ఆదాయంలో 64 శాతం ఆదాయం అక్కడ నుంచే వస్తుందని అదీ తన ఘనత అన్నారు. 

ఆనాడు సైబరాబాద్ సృష్టికర్తను అని చెప్పుకున్న చంద్రబాబు నేడు అమరావతి సృష్టికర్తనంటూ ప్రకటించుకున్నారు. రాజధాని నిర్మాణానికి 50 వేలు కోట్లు అవసరమైతే కేవలం మోదీ 1500కోట్లు మాత్రమే ఇచ్చాడన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. మిగులు భూములను అమ్మేస్తే అప్పులు ఉండవన్నారు. 

సైబరాబాద్ నిర్మించిన వ్యక్తివి అమరావతి ఎందుకు నిర్మించలేదని ప్రశ్నిస్తున్నారని నిర్మించి తీరుతానన్నారు. ప్రపంచం మెుత్తం సైబరాబాద్ గురించి ఎలా మాట్లాడుకుంటుందో అలానే అమరావతి గురించి మాట్లాడేలా నిర్మిస్తానన్నారు. ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో అమరావతి ఒక్కటిగా ఉంటుందన్నారు.

విభజన రోజున తెలంగాణ ధనిక రాష్ట్రమని ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తాను అప్పుల శాతాన్ని తగ్గిస్తే కేసీఆర్ పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదని తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వస్తుందా అంటూ ప్రశ్నించారు.  

కేసీఆర్ ప్రజల తరపున పోరాటం చెయ్యకుండా ఫాం హౌస్ లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. నాయకుడు పోరాటం చెయ్యాలని, ప్రజల కు సేవ అందించాలని చెప్పారు. దేశంలో నెంబర్ వన్ నగరాల్లో ఒక్కటైనా హైదరాబాద్ ను పట్టించుకోకుండా నాపై 24 గంటలు పడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. 

ఎన్టీఆర్ వల్లే కేసీఆర్ రాజకీయాలు నేర్చుకున్నారని గుర్తు చేశారు.కేసీఆర్ తోపాటు లక్షలాది మందికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. చైతన్య రథసారధిగా పనిచేసిన వ్యక్తి హరికృష్ణ ఈ ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు.  హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలన్నా, ఎన్టీఆర్ స్ఫూర్తి నిలబడాలన్నా సుహాసిని గెలిపించాలని కోరారు. మన దేశ భవిష్యత్ కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజాకూటమి గెలవాలని కోరారు.  

కార్యకర్తగా ఉన్నాడని కృష్ణారావుకు సీటు ఇస్తే తనను మోసం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 15 సీట్లు గెలిపించానని గెలిచిన తర్వాత ఎవరి దారి వాళ్లే చూసుకున్నారని మండిపడ్డారు. వాళ్లు ఏం మనుషులు అంటూ దుయ్యబుట్టారు. 

వీళ్లకు రోషం లేదు సిగ్గులేదని తిట్టిపోశారు. మనకు రోషం, సిగ్గు ఉంది కాబట్టి వాళ్లని ఓడించాలని పిలుపునిచ్చారు. తాను ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తానని, తన వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. తనకు పెత్తనం చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. ఇరు రాష్ట్రాలు కూర్చుని నీటి సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ప్రతీ కార్యకర్త కొండవీటి సింహంలా, బొబ్బిలిపులిలా,ఒక సైనికుడిలా వీరోచితంగా పోరాడి నందమూరి ఆడబిడ్డ సుహాసిని గెలుపుకు సహకరించాలని కోరారు.  

ప్రధాని మోదీని నిలదీస్తున్నానని తనను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అటు కేసీఆర్ కూడా బెదిరిస్తున్నాడని విమర్శించారు. బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐని పంపించినా తనను ఏమీ చెయ్యలేరన్నారు. నా రాజకీయ జీవితంలో ఏనాడు వెనకడుగు వెయ్యలేదన్నారు. 

మరోవైపు కోడికత్తి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతుందని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లో 26 కులాల వారిని అగ్రకులాల జాబితాలోకి నెట్టేశారని  ఆ 26 కులాలను మళ్లీ బీసీ వర్గాలుగా పెట్టే బాధ్యత ప్రజాకూటమి తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ పైనా చంద్రబాబు మండిపడ్డారు. పవన్ దారి ఏ దారో తెలియదన్నారు. కన్ఫ్యూజన్ గా ఉంటే ఏం రాజకీయాలు చేస్తారంటూ విమర్శించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉండాలి,పద్ధతి ఉండాలే కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు అంగీకరించరన్నారు.