తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఎపి సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణలో ఓటు హక్కు కల్గిన పౌరులందరు ఓటేయాలని కోరారు. ప్రస్తుతం మీరు వేసే ఓటు చాలా బలమైనదని...దాని ప్రభావంతో చాలా మార్పులు జరుగుతాయని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చాలాచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండటంతో పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. దీంతో ఓటర్లు క్యూలైన్లలోనే వేచిచూస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.   

ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు పోలైనట్టుగా  ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల  చెదురుమదురు  ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నట్లు అధికారులు వెల్లడించారు.