Asianet News TeluguAsianet News Telugu

మూడ్ వస్తే ఫాంహౌస్ లో పడుకోవడం కాదు రాజకీయాలంటే :బాలకృష్ణ

తెలుగుదేశం చరిత్ర చింపేస్తే చినిగిపోయేది కాదని సినీనటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మూడ్ వస్తే ఫాం హౌస్ లో పడుకునేవాడు కాదు కావాల్సింది ప్రపంచాలు తిరిగి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడేవారు కావాలని అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. 

tdp mla nandamuri balakrishna comments on kcr
Author
Sanath Nagar, First Published Dec 1, 2018, 9:02 PM IST

 
సనత్ నగర్: తెలుగుదేశం చరిత్ర చింపేస్తే చినిగిపోయేది కాదని సినీనటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మూడ్ వస్తే ఫాం హౌస్ లో పడుకునేవాడు కాదు కావాల్సింది ప్రపంచాలు తిరిగి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడేవారు కావాలని అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న బాలకృష్ణ ఐటీ అడ్రస్ అంటే తెలియని స్థాయి నుంచి ఐటీకే డెఫినేషన్ చూపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొనియాడారు. హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను గుర్తులను ఎవరూ తుడిపెయ్యలేరని ధ్వజమెత్తారు. 

సైబరాబాద్ నగరాన్ని నిర్మించి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన చరిత్ర చంద్రబాబుదేనని బాలకృష్ణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిన ఆయన్ను ఔటర్ చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వాళ్లు ఔట్ అండ్ ఔట్ కమెడీయన్లుగా మిగిలిపోతారంటూ విమర్శించారు. 

 భారత షట్లర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి వాళ్లను గోపిచంద్ అకాడమీ ద్వారా దేశానికి అందించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరానికి ప్రతిసృష్టి సైబరాబాద్ ను నిర్మించిన యోధుడు చంద్రబాబు అంటూ కొనియాడారు. 

అంతేకానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తెను తీసుకువచ్చి బిల్డప్ లు ఇవ్వడం కాదన్నారు. ఇవాంక ట్రంప్ ను తీసుకువచ్చి ఏదో చేశామని బిల్డప్ లు ఇచ్చారని ఆ బిల్డప్ లు ఏంటో అర్థం కాలేదన్నారు. 

ఈ సందర్భంగా బాహు బలి సినిమా కథ చెప్పారు బాలయ్య. మాహిష్మతి నగరాన్ని బల్లాల దేవుడు పరిపాలించినా ప్రజల గుండెల్లో మాత్రం బాహుబలి ఉంటాడని అలాంటి వారు చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత తల్లిపాలు తాగి విషం కక్కినట్లుగా పార్టీ మారిన వారికి బుద్ధి చెప్పాలని బాలయ్య సూచించారు. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలంటే కూన వెంకటేష్ గౌడ్ ను గెలిపించడమేనన్నారు. 

సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కూన వెంకటేష్ గౌడ్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారని వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నందమూరి తారకరామరావు ఆశయాలను సాధించేందుకు చంద్రబాబు స్ఫూర్తితో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.   

తెలుగుదేశం పార్టీ ఒక కులానికి చెందినది కాదని కూలిపోనిది టీడీపీ అని, ఒక మతానికి చెందిన పార్టీకాదని మట్టిలో కలిసిపోనిదని, ఒకరి కోసం పుట్టినది కాదని వారి వెళ్లిపోతే తుడిచిపెట్టిపోవడానికి అంటూ పంచ్ డైలాగులు వేశారు. ధన దాహంతో పుట్టుకొచ్చిన పార్టీ కాదని వివరించారు. 

పదవుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం కాదని తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారికి అండగా నిలబడే పార్టీ అని స్పష్టం చేశారు. కాంట్రాక్టులు కోసం కక్కుర్తిపడే కార్యకర్తలు కాదు తెలుగుదేశం కార్యకర్తలు చిత్తశుద్ది కలిగిన కార్యకర్తలని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేరన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల వల్ల దేశ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకులపై నమ్మకాలు పోయేలా పరిస్థితులు దిగజార్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీకి కేసీఆర్ సహాయం చేస్తున్నాడని వారి మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. 

నందమూరి ఆశయాలతో చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ముందుకు వెళ్తూ కూన వెంకటేష్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వారికి తగిన శాస్తి జరగాలని పిలుపునిచ్చారు. ఎన్ని సుడిగుండాలు వచ్చినా, సునామీలు వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని బాలయ్య అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios