ఖమ్మం: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఆకర్షితులయ్యారా..?నిన్న మెున్నటి వరకు నేను టీఆర్ఎస్ లో చేరనుంటూ బెట్టు చేసిన ఆయన భవిష్యత్ కోసం తన రూట్ మార్చుకున్నారా..?మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అందుకోసమేనా..?ఇవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు. 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యలు గెలుపొందారు. 

అయితే ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మెచ్చా నాగేశ్వరరావు తుమ్మలను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇకపోతే తెలంగాణలో టీడీపీ అనేది ఉండకూడదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య,మెచ్చా నాగేశ్వరరావులను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు అందించారు. 

అయితే ఇరువురు నేతలు స్పందించకపోవడంతో గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా  రంగంలోకి దిగారు. సండ్ర వెంకట వీరయ్యకు నేరుగా ఫోన్ చేసినట్లు ప్రచారం జరిగింది. మంత్రి పదవి ఇస్తా పార్టీలోకి రావాలంటూ కోరినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై సండ్ర వెంకట వీరయ్య మాత్రం స్పందించలేదు. 

కానీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాను టీడీపీలోనే ఉంటానని సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆ ఇద్దరినీ పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురికి అప్పగించారు.  

ఈ నేపథ్యంలో తమ్మల నాగేశ్వరరావుతో మెచ్చా నాగేశ్వరరావు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకుంది. అయితే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అందులో భాగంగానే తుమ్మలను కలిశారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే మెచ్చా మాత్రం తుమ్మల నాగేశ్వరరావు అనారోగ్యంతో ఉన్నారని వారిని పరామర్శించేందుకే వచ్చానే తప్ప ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.