హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు టిక్కెట్ పై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీలో అయితే అభ్యర్థులు టిక్కెట్ తనకే కేటాయించాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజాకూటమిలో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ఇంకా అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు. పొత్తుల నేపథ్యంలో మల్కాజ్ గిరి టిక్కెట్ ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉండటంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత మండలి రాధాకృష్ణ యాదవ్ కు టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మండలి రాధాకృష్ణ యాదవ్ అనుచరులు, టీడీపీ నేతలు పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.

మల్కాజ్ గిరి టికెట్ రాధాకృష్ణకు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆందోళన కారులను అడ్డుకుని అక్కడ నుంచి పంపించేశారు. 

మరోవైపు మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రజాకూటమిలో పొత్తులు సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.