తెలంగాణ లో డిసెంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమై లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలోని కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకోసం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకునే ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా  టిడిపి నాయకులు, మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూడా కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో కాస్త ఘాటుగానే కేసీఆర్ పాలనను విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు విరుద్దంగా నడుచుకుని నాలుగున్నరేళ్ల పాలనను కేసీఆర్ వృధా చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడినట్లు దేవేందర్ గౌడ్ ఆరోపించారు.

ప్రజాస్వామ్యబద్దమైన ముఖ్యమంత్రి పదవిలో వుండి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగించారని అన్నారు. అసలు తాము ప్రజాస్వామ్యంలో వున్నామా అన్న అనుమానం కలిగేలా టీఆర్ఎస్ పాలన సాగిందన్నారు. యువశక్తి, మౌళిక సదుపాయాలు అందుబాటులో వున్నా వాటిని కేసీఆర్ వినియోగించుకోలేక పోయారని అన్నారు. 

తెలంగాణ ప్రజలను కులాల పేరిట వేరుచేస్తూ విభజించు-పాలించు అన్న ఆంగ్లేయుల సూత్రాన్ని కేసీఆర్ అమలు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ అనైతిక రాజకీయాల గురించి తెలంగాణ ప్రజలు గుర్తించారని...వారు తిరగబడముందే రాజకీయాల్లోంచి తప్పుకుంటే బావుంటుందని హితవు పలికారు. అయితే మీరు ఎక్కడున్నాసంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటానంటూ దేవేందర్ గౌడ్ ఈ లేఖ ప్రారంభంలోనే పేర్కొన్నారు.