2018 అసెంబ్లీ ఎన్నికల తరువాతే తెలంగాణాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని అంతా అనుకున్నారు. ఆ తరువాత గెలిచినా ఆ కొందరు ఎమ్మెల్యేలు కూడా అధికార పక్షం తీర్థం పుచ్చుకోవడంతో ఇక టీడీపీ కనుమరుగయ్యిందని అంతా భావించారు. 

ఆ తరువాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయలేదు. దానితో టీడీపీ ఊసే మర్చిపోయారు అందరూ. కొందరు హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు మాత్రం టీడీపీని వీడకుండా అందులోనే కొనసాగుతున్నారు. 

తాజాగా తెలంగాణాలో ప్రకటించిన మునిసిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా అమీన్ పుర మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ తరుఫున ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. 21వ వార్డులో ఎడ్ల రమేష్ గెలుపొందగా, 22వ వార్డులో ఎడ్ల సంధ్య విజయం సాధించారు. 

ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.... ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఒక్కసారిగా ఇలా పక్కపక్కన వార్డుల్లో టీడీపీ గెలవడం, అందునా భార్యాభర్తలు గెలవడం ఒక్కసారిగా ఆనందోత్సవాహాలు వెల్లివిరిసాయి. 

ఇక పోతే ఉదయమే మధిర మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డులో తెలుగుదేశం బోణి కొట్టింది. ఆంధ్రకు సరిహద్దు ప్రాంతమైన ఈ మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కు షాక్ ఇస్తూ తెరాస ఈ మునిసిపాలిటీని కైవసం చేసుకుంది.