హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు .. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రజలు, కార్యకర్తల ఘన స్వాగతం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. జై బాబు , జై సీబీఎన్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం బేగంపేట్ నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చంద్రబాబుకు బయల్దేరారు. దారి పొడవునా ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. రేపు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎల్ వీ ప్రసాద ఐ ఇన్‌స్టిట్యూట్‌లో కంటీ పరీక్షలు చేయించుకోనున్నారు చంద్రబాబు.
ALso Read: ఇంట్లోకి వెళ్లగానే చంద్రబాబు చేసిన మొదటి పని ఇదే... భువనేశ్వరి భావోద్వేగం
ఇకపోతే... చంద్రబాబు చర్మ , హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అలాగే ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు.. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో మరిన్ని షరతులు విధించాలని కోరతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నవంబర్ 3న తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. కోర్టు ఆదేశాలను చంద్రబాబు అతిక్రమించలేదని.. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశాన్ని గతంలో కోర్టులు కల్పించాయని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. సీఐడీ చెబుతున్న షరతులు చంద్రబాబు హక్కులను హరించే విధంగా వున్నాయని పేర్కొన్నారు.
సీఐడీ తరపు న్యాయవాది వాదిస్తూ.. చంద్రబాబు మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. కోర్ట్ ఆదేశాలు వున్న తర్వాత కూడా చంద్రబాబు మీడియాతో మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ర్యాలీలు నిర్వహించవద్దన్న ఆదేశాలు వున్నప్పటీకి.. రాజమండ్రి జైలు నుంచి విజయవాడ వరకు 13 గంటల పాటు ర్యాలీ నిర్వహించారని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు.