హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. 

హుజూర్ నగర్ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్థిని ప్రకటించాలా, లేకపోతే గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలా అనే అంశంపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని ఈ పరిణామాల నేపథ్యంలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయప్డారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాతో తెలుగుదేశం పార్టీకి అవినావభావ సంబంధం ఉన్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటే పోటీ చేయక తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

హుజూర్ నగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ నాయకులంతా కష్టపడి పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి స్ఫష్టం చేశారు. కార్యకర్తల సూచనలతో చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారని ఆదివారం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమవారం తన నామినేషన్ ను దాఖలు చేయనున్నట్లు రావుల చెప్పుకొచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ఇది ఒక అవకాశంగా భావించుకుని పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.