పూర్తిగా చేతులెత్తేసిన బిఆర్ఎస్ ... ఏకంగా ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా

సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని‌ కార్మిక సంఘం పోటీకి దూరంగా వుంటుందని బిఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కార్మిక సంఘం అధ్యక్షుడితో సహా కీలక నాయకులు రాజీనామా చేసారు. 

TBGKS President and working president resign before Singareni Election 2023 AKP

కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆ పార్టీ నుండి మెల్లిగా వలసలు మొదలవగా సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో మరింత జోరందుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలన్న బిఆర్ఎస్ అధినేత ఆదేశాలతో తీవ్ర నిరాశచెందిన తెలంగాణ బొగ్గు గని‌ కార్మిక సంఘం నాయకులు పార్టీని వీడారు. బిఆర్ఎస్ కార్మిక విభాగం TBGKS అధ్యక్షుడు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పార్టీని వీడారు. 

ఎన్నికల్లో పోటీచేయని బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘంలో వుండలేకపోతున్నామని... అందువల్లే రాజీనామా చేసినట్లు టిబిజికెఎస్ నాయకులు తెలిపారు. తాముమాత్రమే కాదు టిబిజికెఎస్ ను నమ్ముకున్న కార్మికులు సైతం బిఆర్ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కారణం ఏదైనా ఎన్నికల్లో పోటీకే దూరంగా వుండాలన్న నిర్ణయం సరికాదని కార్మికసంఘం నాయకులు అంటున్నారు. 

ఇప్పటికే తమ రాజీనామా లేఖలను టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత కు పంపినట్లు నాయకులు తెలిపారు. తమతో పాటే కార్మికులు కూడా టిబిజికెఎస్ కు దూరం కానున్నారని... మూకుమ్మడిగా యూనియన్ కు రాజీనామా చేస్తున్నామని అన్నారు. వీరంతా కాంగ్రెస్ అనుబంధ కార్మికసంఘ ఐఎన్టియూసి(ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) చేరనున్నట్లు తెలుస్తోంది. 

Also Read  ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం

టిబిజికెఎస్ కు రాజీనామా చేసిన వెంకట్రావు ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబును కలిసారు. అలాగే కాంగ్రెస్ కార్మిక విభాగం ఐఎన్టియూసి నేత జనక్ ప్రసాద్ తో కూడా భేటి అయ్యారు. దీంతో టిబిజికెఎస్ నాయకులంతా ఐఎన్టియూసి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

అయితే టిబిజికెఎస్ నాయకులను ఎన్నికల వేళ ఐఎన్టీయూసీ చేర్చుకోవడాన్ని కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బిఆర్ఎస్ కార్మిక విభాగం నేతలను చేర్చుకోవద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరేందుకు ఇప్పటికే కొందరు నాయకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. టిబిజికెఎస్ నాయకులను ఐఎన్టీయూసీలో  చేర్చుకోవడం ద్వారా కలిగే లాభమేమీ లేదని... వ్యక్తిగత స్వార్థంతోనే వాళ్లు కలిసేందుకు సిద్దమయ్యారంటూ సీఎంకు వివరించనున్నట్లు కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. గత పదేళ్ళు టిబిజికెఎస్ లో వుండి తమను ఇబ్బందిపెట్టి ఇప్పుడు అధికారం కోల్పోగానే జంప్ అయ్యేందుకు సిద్దమయ్యారు...  వాళ్ళను ఎట్టిపరిస్థితుల్లో చేర్చకోవద్దని సీఎం రేవంత్ ను కోరాలని కాంగ్రెస్ కార్మిక విభాగం నేతలు కోరనున్నారు. 

ఇదిలావుంటే హైకోర్టు ఆదేశాలతో సింగరేణి ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 27న గుర్తింపు కార్మిక సంఘాల మధ్య ఎన్నికలు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.  

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios