వికారాబాద్ జిల్లా తాడూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా తీవ్ర ఎండలో పెద్దేముల్ మండలంలో పర్యటస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తీవ్ర ఆందోళనలకు లోనైన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత కూడా కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం కుదుటపడుతోందని... ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే మరికొద్దిరోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన పర్యటనలన్ని రద్దవనున్నాయి.

ఇటీవల తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించాడు. టీఆర్ఎస్ పార్టీ హవా, మంత్రి పలుకుబడిని కూడా కాదని ఆయన గెలుపొందారు. ఇలా ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో వుంటూ వారి సమస్యల పరిష్కారినికి ప్రయత్నిస్తున్నారు. 

అంతేకాకుండా రోహిత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల నుండి ఎంపీగా మరోసారి పోటీకి దిగుతుండటంతో పనిలో పనిగా ఆ ప్రచారాన్ని కూడా  చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి పెద్దేముల్ మండలంలో పర్యటిస్తూ ఎండవేడిమికి తట్టుకోలేక అనారోగ్యంపాలయ్యారు.