ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల పర్వం మొదలైంది. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలువురు రాజీకీయ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాగా.. చాలా మంది ఓటర్లు.. ఎన్నికల్లో తమ ఓటును డబ్బు కోసం అమ్ముకుంటూ ఉంటారు. అయితే.. అలాంటి ఓటర్లను ఉద్దేశించి బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం ఓ గాడిద కథను చెప్పారు.

మహబూబాబాద్ లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన ఆయన ‘ ఓటరు.. నాయకుడు.. గాడిద’ అంటూ చెప్పిన కథ ఆలోచింపచేసేలా ఉంది. ఆయన చెప్పిన కథలోకి ఒకసారి వెళితే...‘‘ ఒక రాజకీయ నాయకుడు ఓ గ్రామానికి వెళ్లి ఓట్లు అడుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో చెరువు దగ్గర పనిచేసుకుంటున్న రజకుడిని ఓటు అడుగుతూ రూ.2వేల నోటు ఇవ్వబోతాడు.’’

‘‘ ఆ రాజకీయ నాయకుడు ఇచ్చిన డబ్బు తీసుకోవడానికి ఆ రజకుడు అంగీకరించడు. డబ్బు ఇస్తే ఊరికే ఖర్చు అయిపోతాయి. అదే ఏదైనా వస్తువు ఇస్తే గుర్తిండిపోతోంది అని ఆ రజకుడు అంటాడు. దానికి సమాధానంగా ఆ రాజకీయనాయకుడు సరే ఏం కావాలి అని అడుగుతాడు. అందుకు తనకొక గాడిద కావాలి అని అడుగుతాడు.’’

‘‘ సరే అని వెళ్లిన ఆ రాజకీయనాయకుడు మళ్లీ వచ్చి.. నువ్వు ఈ రూ.2వేలు తీసుకో.. ఎందుకంటే.. రూ.2వేలకు గాడిద రావడం లేదు. కనీసం రూ.4నుంచి రూ.10వేలు చెబుతున్నారు అని ఆ రజకుడికి చెబుతాడు. దానికి సమాధానంగా దీంతో సదరు ఓటరు రూ.2 వేలకు గాడిదే రాకుంటే గాడిద కొడకా ఆ రెండు వేలకు నేనేలా వస్తాన్రా..? అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇస్తాడు. ఇలా ప్రతి ఓటరు చైతన్యవంతుడైతే భ్రస్టు రాజకీయ పార్టీలు గద్దెనెక్కలేవంటూ తమ్మినేని ముక్తాయింపుతో సభలో హర్షధ్వానాలు మోగాయి.