రాష్ట్రంలోని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రోశయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ అమీర్ పేటలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సనత్‌ నగర్ నియోజకవర్గం అమీర్‌పేట డివిజన్‌లోని రహదారులు భవనాలశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు హక్కును వినియోగించుకోవాలని అది మనందరి బాధ్యత అన్నారు. తనకు ఆరోగ్యం సరిగాలేకపోయినప్పటికీ..ఓటువేసినట్లు ఆయన చెప్పారు. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు.  మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 48శాతం ఓటింగ్ నమోదైంది.  మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.