హైదరాబాద్: గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ దుర్వినియోగం చేయడంపై సర్కారియా కమిషన్ సిఫార్సులను ఎత్తి చూపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిపీఆర్వో జ్వాలా నరసింహారావు వనం రాసిన వ్యాసం చర్చనీయాంశంగా మారింది. తమిళిసై పేరెత్తకుండా ఆ వ్యాసం రాసినప్పటికీ, తెలంగాణ గవర్నర్ గా ఆమె నియామకం జరిగిన నేపథ్యంలో ఆ వ్యాసం రావడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

సిఎం సీపీఆర్వో రాసిన Gubernatorial gimmicks of modern times (ఆధునిక కాలంలోని గవర్నర్ కార్యాలయ జిమ్మిక్కులు) పేర స్థానిక ఆంగ్లదినపత్రకిలో ఆదివారంనాడు ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ఆయన తమిళిసై పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, సర్కారియా కమిషన్ నివేదిక సిఫార్సులను, సూచనలను ప్రస్తావిస్తూ ఆయన ఆ వ్యాసం రాశారు.

రాజకీయంగా చురుగ్గా వ్యవహరించే వ్యక్తిని గవర్నర్ గా నియమించకూడదనే సర్కారియా కమిషన్ సూచనను ఆయన ఎత్తిచూపారు. గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని, 1980 దశకంలో అలా జరిగిందని ఆయన చెప్పారు. అయితే, తెలంగాణ గవర్నర్ గా నియమితులు కావడానికి ముందు తమిళిసై తమిళనాడు బిజెపి చీఫ్ గా ఉన్నారు.  ఇటీవల ఐదుగురు గవర్నర్లను నియమించిన విషయాన్నిప్రస్తావిస్తూ కో ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తి ఆ నియామకాల్లో లోపించిందని విమర్శించారు. 

రాజకీయాలకు సంబంధం లేనివారిని గవర్నర్లుగా నియమించాలని ఆయన ఓ సూచన చేశారు. గవర్నర్ల వ్యవస్థ తొలి నుంచి వివాదాస్పదంగానే ఉందని కూడా చెప్పారు. గవర్నర్లుగా నియమితులయ్యే వారు ఎలా ఉండాలో సర్కారియా కమిషన్ సూచలను ఎత్తిచూపుతూ జ్వాలా చెప్పారు. 

సిఎం సీపీఆర్వో తన పేరు మీద ఇటువంటి వ్యాసం రాయవచ్చా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే తమిళిసై నియామకాన్ని పరోక్షంగా అది ప్రశ్నించింది. తమిళిసై నియామకం కేసీఆర్ కు ఇష్టం లేదనే విషయం ఆ వ్యాసం ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. జ్వాలా నరసింహా రావు వనం రాసిన ఆ వ్యాసాన్ని బిజెపి శ్రేణులు తప్పు పడుతున్నాయి.