హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే అర్హత లేదని విరుచుకుపడ్డారు. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రాజస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. 

సోమవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఈవీఎంలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవలేదా అంటూ ప్రశ్నించారు. 

17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్నారు. కాంగ్రెస్ నేతలు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలని హితవు పలికారు. తమ పాలన బాగుంది కాబట్టే ప్రజలు మళ్లీ పట్టంకట్టారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు బీజేపీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని, ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. అభినందన్‌ను వదలకపోతే పాక్‌కు కాలరాత్రేనని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమన్నారు. 

భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రధాని బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. ప్రతి అంశాన్నీ ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం బీజేపీ నేతలకు సరికాదన్నారు. దత్తాత్రేయ రిటైర్ అయి ఇంట్లో కూర్చొవాలని సూచించారు.