ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కిన కేశంపేట తహశీల్దార్ లావణ్య... అధికారులకు చుక్కలు చూపిస్తోంది. విచారణలో అధికారులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెడతున్నట్లు సమాచారం. శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి ఆమెను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు...  కొన్ని గంటలపాటు విచారించారు. అయితే... విచారణ మొదలుపెట్టగానే ఆమె కుంటి సాగులు చెప్పడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తనకు తల తిరుగుతోందని.. వాంతు వచ్చేలా ఉందని చెబుతూ విచారణ ముందుకు సాగకుండా చేసినట్లు సమాచారం.

ఇటీవల ఏసీబీ దాడిలో లావణ్య వద్ద రూ.93లక్షల నగదును అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ నగదు ఎలా సంపాదించారంటూ అధికారులు వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. అధికారులు ఏమి అడిగినా కూడా ఆమె మౌనంగానే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలకు విచారించినా.. ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయామని ఏసీబీ అధికారులు చెప్పారు. 

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు గత వారం తహశీల్దార్ లావణ్య ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో రూ.93లక్షల నగదు లభించిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ఉత్తమ తహశీల్దార్ అవార్డు కూడా అందుకోవడంతో.. ఆమె అవినీతికి పాల్పడటం తీవ్ర సంచలనానికి దారి తీసింది.