ఉద్యోగం కోసం దేశం కాని దేశం వెళ్లి... అక్కడే ఇరుక్కుపోయాడు. తిరిగి స్వదేశంలో అడుగుపెడదామంటే..  అవకాశం లేకపోవడంతో... ఫేస్ బుక్ ద్వారా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ని వేడుకున్నాడు. ఆయన సహకారంతో తిరిగి... స్వేదశంలో అడుగుపెట్టబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లి గ్రామం నుంచి వీరయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లాడు. రియాద్‌లోని ఎడారిలో ఒంటెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటెల యజమాని పెట్టే బాధలను తాళలేక పోయాడు. ఎలాగోలా తాను పడుతున్న బాధలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

ఆ వీడియోలను చూసి తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీని గురించి వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో మాట్లాడారు. ఆమె సహకారంతో వీరయ్య కష్టాలు గట్టెక్కాయి. వీరయ్య ఆచూకీ తెలుసుకొని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రియాద్‌లోని ఇండియన్‌ ఎంబసీ కార్యాలయం వేగంగా స్పందించింది. వీరయ్య ఎక్కడ ఉన్నాడో గంటల్లోనే పూర్తి సమాచారాన్ని సేకరించింది. రియాద్‌ ఎంబసీ కార్యాలయంలో హైదరాబాద్‌ వాసి ఉండటంతో వీరయ్య ఆచూకీ తెలుసుకోవడం సులభమైంది. రంజాన్ తర్వాత వీరయ్య...తిరిగి తెలంగాణలో అడుగుపెట్టనున్నారు.