హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అంటూ ధ్వజమెత్తారు. ఏపీలో అవినీతి లేదని చంద్రబాబు చెప్తున్న మాటలు సుద్ద అబద్ధమన్నారు. 

ఏపీలో జీరో పర్సంట్ అవినీతి అని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నువ్వు సిద్ధమా అంటూ నిలదీశారు. చంద్రబాబుది మోసం చేయాలన్న వ్యక్తిత్వమని విమర్శించారు. పోలీసులు, సీఎస్‌లను చంద్రబాబు నిండా ముంచుతారన్నారు. 

ఏపీ వాళ్ల ఆస్తులను లాక్కోవడానికి ట్విటర్‌ పిట్ట సరిపోతుందంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. తనని ఎందుకు వస్తున్నావ్ అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా మీ తాతదా.. మేము వస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏపీలో తమకు బంధువులు, సన్నిహితులు ఉన్నారని తెలిపారు. వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి కేసులో బాబు అడ్డంగా దొరికిపోయి పారిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

దొంగ చంద్రబాబుని నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు టీఆర్‌ఎస్‌ పిలుపునిస్తోందన్నారు. ప్రభుత్వంలో కొట్టేసిన డబ్బును వైట్‌ చేసుకోవడానికే హెరిటేజ్‌లో లాభాలు వస్తున్నట్లు చూపిస్తున్నారన్నారని ఆరోపించారు. 

మరోవైపు జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇళ్లు అధికారికంగా రూ.2 కోట్లు అంటున్నారని అనధికారికంగా అది రూ.20 కోట్లు పలుకుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైనవారు చంద్రబాబని ఎద్దేవా చేశారు. నిన్నమొన్న పుట్టిన చంద్రబాబు మనువడికి అన్ని కోట్ల ఆస్తా? అని తలసాని ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ ఎంటో తనకు తెలుసునన్నారు.  ఏపీలో చంద్రబాబు నాయుడు కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం హైదరాబాద్ లోనే ఉంటారని ఆయన జోస్యం చెప్పారు.