సూర్యాపేట : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. కాంగ్రెస్, టీఆర్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయం రంజుగా మారుతోంది. 

ఇకపోతే త్వరలో గాంధీభవన్ కు తాళాలు తప్పవంటూ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం లేదని అందువల్లే గాంధీభవన్ కు తాళాలు వేసుకోవాల్సిందేనన్నారు. 

సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ అనే మహాసముద్రంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కలిసిపోయిందన్నారు. టీఆర్ఎస్ లో తెలుగుదేశం పార్టీ కలిసిపోవడవంతో ఎన్టీఆర్ భవన్ కు తాళాలు పడ్డాయని చెప్పుకొచ్చారు. 

తెలంగాణను అస్థిరపరచడానికి చంద్రబాబు చేయని కుట్రంటూ లేవంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుట్రలను కేసీఆర్ సమర్థవంతంగా తిప్పి కొట్టారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే గాంధీభవన్ కు కూడా తాళాలు తప్పవంటూ ఎద్దేవా చేశారు.