హైదరాబాద్: గత కొద్దిరోజులుగా మాజీ ఎంపీ వీహెచ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనా కస్సుబుస్సులాడుతున్నారు. తాజాగా మరోసారి సొంతపార్టీపై చిర్రుబుర్రులాడారు. 

భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనుమతి ఇచ్చే విషయంలో జాతీయ స్థాయిలో పోరాడాలి కానీ, తమ పార్టీలో ఈ విషయంపై సరైన స్పందన లేదంటూ కుండబద్దలు కొట్టారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఫిరాయించిన ఎమ్మెల్యేలను, కీలక నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకే సిగ్గు చేటంటూ విరుచుకుపడ్డారు. చిన్న చిన్న తప్పులు చేసిన వారిని మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకోవాలని, పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వెళ్లిన వారిని మాత్రం ఉపేక్షించరాదన్నారు. 

ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను కోరినట్లు తెలిపారు. తమకు నచ్చని వారిని పార్టీలోకి తీసుకుంటే తాము పని చేయమని కొందరు వాదిస్తున్నారని, ఆ వాదన సరికాదన్నారు. కోర్టు సాకుతో కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మోసం చేశాడని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని వీహెచ్ పిలుపునిచ్చారు.