హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శాసన మండలికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో లెవనెత్తలేని అంశాలపై మండలిలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని కానీ అలా ప్రవర్తించడం లేదన్నారు. 

మండలి సమావేశాలను కేవలం ఆర్ధికమంత్రితోనే సరిపెట్టడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై మండలిలో తాముప్రశ్నిస్తుంటే సమాధానాలు దొరకడం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్ శాసన మండలికి వచ్చి ఉంటే ఆ అంశాలకు స్పష్టత వచ్చేదన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి గిరిజనులు 720 మెడికల్ సీట్లు నష్టపోయారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఉపాధ్యాయ పరీక్షల నిమిత్తం టెట్ పరీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. పంటరుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రైతులకు నేటికి అందలేదని చెప్పుకొచ్చారు.  గడచిన ఆరేళ్లలో గల్ఫ్ బాధితులకు ఆర్థిక సాయం అందలేదని చెప్పుకొచ్చారు. తక్షణమే ప్రభుత్వం ఈఅంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.