సంగారెడ్డి: సంగారెడ్డిలోని తారా డిగ్రీకళాశాలలో పీజీ సెంటర్ తొలగింపు అంశం ఉద్రిక్తతలకు దారి తీసింది. తారా డిగ్రీ కళాశాలలోని పీజీ సెంటర్ తరలింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 

విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు పలికారు. పీజీ సెంటర్ తరలించడానికి వీర్లేదంటూ డిమాండ్ చేశారు. జగ్గారెడ్డితోపాటు జగ్గారెడ్డి సతీమణి సైతం విద్యార్థులకు మద్దతు పలికారు. అనంతరం జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ ను కలిసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. 

ర్యాలీగా కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దాంతో తారా డిగ్రీ కళాశాల దగ్గర పరిస్థితి సద్దుమణిగింది. 

మరోవైపు అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని, విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలంటూ డీసీసీ అధ్యక్షురాలు నిర్మల ఆందోళనకు దిగారు. పీజీ సెంటర్ తరలింపు నిలిపివేయాలని తమ న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించకుండా అరెస్ట్ చేస్తారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.