బీసీలకు టికెట్ల కేటాయింపు .. కేసీ వేణుగోపాల్‌తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేతలు శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు . ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున కనీసం 34 అసెంబ్లీ స్థానాలను బీసీ కులాలకు కేటాయించాలని వారు ఆయనను కోరారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేతలు తమ స్వరం పెంచుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వర్గాలకు టికెట్లు ఎక్కువగా కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను బీసీ నేతలు కలిసిశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 చొప్పున కనీసం 34 అసెంబ్లీ స్థానాలను బీసీ కులాలకు కేటాయించాలని వారు ఆయనను కోరారు.
దీనిపై స్పందించిన వేణుగోపాల్ బీసీలకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేణుగోపాల్‌ను కలిసిన వారిలో ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ సహా 40 మంది బీసీ నేతలు వున్నారు.
Also Read: 40కిపైగా అసెంబ్లీ సీట్లకు పట్టు:ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ బీసీ నేతలు
కాగా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్ల కేటాయింపులో స్పష్టత లేదని ఆ వర్గం నేతలు అనుమానిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి గతంలో సూచించారు. ఈ విషయాన్ని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలకు చివరి నిమిషంలో టిక్కెట్టు కేటాయించారు. అంతేకాదు టిక్కెట్టు కోసం పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో అగ్రనేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
పార్టీలో కీలకంగా ఉన్న బీసీ నేతలకు కూడా టిక్కెట్ల కేటాయింపులో గ్యారెంటీ లేకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు రాష్ట్ర నాయకత్వం వద్ద ప్రస్తావించారు. బీసీ సామాజిక వర్గం నేతలకు మెజారిటీ సీట్లు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించాలని వీరు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీ సామాజికవర్గం ప్రజలే ఉన్నారు. దీంతో బీసీ సామాజిక వర్గం నేతలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వర్గంలోని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.