లిఫ్ట్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని హియాత్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జియాగూడకు చెందిన రేఖ(45) అనే మహిళ.. హిమాయత్ నగర్ లోని తెలుగు అకాడమీ సమీపంలోని ఓ గర్ల్స్ హాస్ట లో స్వీపర్ గా పనిచేస్తోంది. అది మొత్తం ఐదు అంతస్థుల బిల్డింగ్ కాగా.. కింద రెండింటిలో కార్ల కంపెనీలు ఉండగా.. పై మూడు అంతస్థుల్లో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. కాగా.. రోజూ మాదిరిగా రేఖ.. హాస్టల్ ని శుభ్రం చేసేందుకు వచ్చింది.

పని ముగించుకొని ఐదో అంతస్థుల్లో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తోంది. లిఫ్ట్ రాకుండానే దాని డోర్ తెరుచుకోవడంతో.. ఆమె అది గమనించకుండా లోపలికి అడుగుపెట్టింది. ఈ క్రమంలో కిందకు పడిపోయింది. దీంతో.. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి వారు ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా.. చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఆమె మద్యం సేవించి ఉందని అందుకే అలా జరిగిందని హాస్టల్ యజమాని చెబుతున్నారు. అయితే.. లిఫ్ట్ నిర్మాణం సరిగా లేదని అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.