బీజేపీకి రాజీనామా చేసిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో వీరిద్దరితో కలిసి పనిచేసినట్లు మంత్రి గుర్తుచేసుకున్నారు. దాసోజు శ్రవణ్ సెల్ఫ్‌మేడ్ లీడర్ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి బిడ్డా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు.
అనంతరం స్వామి గౌడ్ మాట్లాడుతూ... కేసీఆర్ పిలుపుతో ఉద్యమంలో కసిగా పనిచేశామని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ గర్జన ప్రారంభమైంది ఈరోజేనని ఆయన గుర్తుచేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసమే తాను బీజేపీలో చేరినట్లు స్వామి గౌడ్ తెలిపారు. విభజన సమస్యలపై కేంద్ర పెద్దలకు పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. తాను బీజేపీలో చేరిన ఆశయం నెరవేరలేదని, అందుకే రాజీనామా చేసినట్లు స్వామిగౌడ్ పేర్కొన్నారు.
దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల తర్వాత సొంత ఇంటికి వచ్చానని అన్నారు. కేసీఆర్ చేయి పట్టుకొని ఉద్యమంలో గొంతుకగా పనిచేశానని ఆయన తెలిపారు. దేశానికే తలమానికంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని శ్రవణ్ పేర్కొన్నారు. బీజేపీలో కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకే ప్రాధాన్యత వుందని ఆయన చెప్పారు.
