కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్వచ్చ భారత్. దేశాన్ని పరిశుభ్రంగా వుంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రత విషయంతో ఓ పోటీ నిర్వహించి...అత్యుత్తమంగా నిలిచిన వాటికి స్వచ్చతా ఎక్సలెన్సీ పేరుతో ప్రత్యేక అవార్డులను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. అయితే తాజాగా ఈ అవార్డు మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని వరించింది. 

 2018 సంవత్సరానికి గాను స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డుకు గ్రేటర్ హైదరాబాద్‌ ఎంపికైనట్లు ఇటీవలే కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దాదాపు 10 లక్షలకు పైగా జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరాల్లో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఈ పురస్కారం దక్కినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్ నగర ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. 

ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి  కమీషనర్ దానకిశోర్ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా చేతుల మీదుగా ఈ  స్వచ్ఛతా ఎక్సలేన్సీ అవార్డును అందుకున్నారు.

అనంతరం దానకిశోర్ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ ను పరిశుభ్రంగా వుంచడానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు లభించడం గర్వంగా ఉందన్నారు.  పది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరానికి రెండు గుర్తింపులు లభించడం పట్ల  జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్ 2019 లోనూ మంచి ర్యాంకింగ్ సాధిస్తామని దాన కిషోర్ ధీమా వ్యక్తం చేశారు.