వైసీపీ అధినేత జగన్ పై ఆ పార్టీ సీనియర్ నేత మండిపడుతున్నారు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో పార్టీ కోసం కృషి చేస్తున్న తనను పార్టీ నుంచి తొలగించడంపై పొలిశెట్టి శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్ని నిరసిస్తూ.. తన అనుచరులతో లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ...జగన్ ప్రతి విషయంలోనూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఏపీలోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో జగన్ కి వ్యతిరేకంగా ఒక్కరోజు దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీకోసం అంకితభావంతో పనిచేస్తున్న వారికి జగన్ కనీస మర్యాద కూడా ఇవ్వరన్నారు. కేవలం డబ్బులు ఉన్న నేతలకు మాత్రమే తన వద్ద స్థానం ఇచ్చుకుంటారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు ప్రజలకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో అధికారం కోసం తెలంగాణలో పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. త్వరలో ఏపీలో పర్యటించి తనకు జరిగిన అన్యాయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తానని ఆయన అన్నారు.