సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ యువతిని కిడ్నాప్ చేసి మత్తు మందు ఇచ్చిన ఇద్దరు యువకులు రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు స్థానిక టీఆర్ఎస్ నేత కుమారుడు.
తెలంగాణ (telangana) రాష్ట్రం సూర్యాపేట (suryapet district) జిల్లా కోదాడలో (kodad) ఓ యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు యువకులు రెండు రోజుల పాటు అత్యాచారం (gang rape) చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరిగా చెబుతున్న స్థానిక టీఆర్ఎస్ నేత కుమారుడు సహా మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని టీఆర్ఎస్ (trs) మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మహ్మద్ ఖాజా (Mohd Khaja) కుమారుడు షేక్ గౌస్ పాషా (Sheik Ghouse Pasha) , అతనికి సహకరించిన సాయిరాంరెడ్డిగా ( Sairam Reddy) గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితులను స్థానిక కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి వీరికి రెండు వారాల జుడీషియల్ రిమాండ్‌ను విధించారు.
శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో వీరిద్దరూ తనను ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని.. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించినట్లు యువతి చెప్పింది. ఆమె మత్తులోకి జారుకున్నాక బంధించి వీరిద్దరూ మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో బాధితురాలిపై రాక్షసంగా వ్యవహరించారు. చివరికి ఎలాగోలో వారి నుంచి తప్పించుకున్న యువతి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబసభ్యులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
