చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తమ్ముడు దూరం కావడంతో అన్న కదిలిపోయాడు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మొదటి వర్ధంతి రోజున ఊరిలో తమ్ముడి నిలువెత్తు రూపంతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రేమకు అజరామరం అని చాటాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (S) మండలం బొప్పారం గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
ఒకే ఒడిలో లాలిపాట విన్న ఆ అన్నదమ్ములు ఒకరిలో మరొకరు అన్నట్టు పెరిగారు. పెద్దయ్యాక పెళ్లిల్లు చేసుకున్నా వారి మధ్య ప్రేమ, వాత్సల్యానికి కొదవరానీలేదు. తమ్ముడికి అన్న అండగా నిలబడితే.. అన్నకు తమ్ముడు దన్నుగా ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఎవరి పనిలో వారు రాణిస్తున్నా.. వారి మధ్య దూరం రాకుండా చూసుకున్నారు. కానీ, వీరి అనురాగం, ఆప్యాయతలను విధి వెక్కిరించింది. తమ్ముడిని అన్నకు దూరం చేసింది. తమ్ముడి మరణంతో అన్న వేదనకు లోనయ్యాడు. తమ్ముడి జ్ఞాపకాల్లో తల్లడిల్లిపోయాడు. తమ్ముడిని మళ్లీ నిలువెత్తు రూపంలో చూడాలనుకున్నాడు. తమ్ముడు మరణించి ఏడాది గడిచిన రోజునే ఊరి నడిబొడ్డున ప్రేమతో తన తమ్ముడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సోదరుల అనుబంధానికి ఊరు ముగ్దురాలైంది. పదేళ్లు తమ సర్పంచ్‌గా ఉన్న వ్యక్తి విగ్రహ ఏర్పాటుకు పురనివాసులు తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (S) మండలం బొప్పారం గ్రామం ఈ అజరామర ప్రేమకు వేదికైంది.
బొప్పారం గ్రామంలో గోపగాని లక్ష్మీనారాయణ, ప్రమీల దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె వెంకట రమణ, కుమారులు రమణ మూర్తి, రామకృష్ణ. ఇద్దరూ ప్రజలకు సేవ చేసే రంగాల్లోకే వెళ్లారు. అన్న రమణమూర్తి న్యాయవాద వృత్తి చేపడితే.. తమ్ముడు రామకృష్ణ ప్రజారంగంలోకి దిగి రాజకీయాల్లో రాణించాడు. బొప్పారం గ్రామానికి రెండుసార్లు సర్పంచ్‌గా గెలిచి పదేళ్లపాటు గ్రామస్తుల మన్ననలు పొందాడు. రామకృష్ణపై కాలం కన్నేసింది. గుండె సమస్యతో రామకృష్ణ అర్ధంతరంగా తనువు చాలించాడు. తమ్ముడి మరణంతో అన్న రమణమూర్తి శోకసంద్రంలో మునిగిపోయాడు. ఏడాదిపాటు తమ్ముడి జ్ఞాపకాల్లోనే కొట్టుమిట్టాడాడు.
Also Read: దేశ విభజనతో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా తమ్ముడు.. కంటతడి పెట్టించే వీడియో
తమ్ముడి దూరమయ్యాడు కానీ, ఆయన మీది ప్రేమ దూరం కాలేదు. అది అజరామరం. అందుకే ఏడాదిపాటు కన్నుల్లో నింపుకున్న తమ్ముడి నిలువెత్తు రూపాన్ని గ్రామంలో నిలువెత్తు విగ్రహంగా ఏర్పాటు చేయాలని రమణమూర్తి అనుకున్నాడు. మొదటి వర్ధంతి రోజున ఊరి మధ్యలో రామకృష్ణ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాడు. తమ్ముడి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. రామకృష్ణ మన మధ్యలేకున్నా.. ఆయన ఆశయాలు సాధించుకోవాలని రమణమూర్తి పిలుపు ఇచ్చాడు. వారి అన్నదమ్ముల బంధాన్ని ఊరి ప్రజలు కొనియాడారు.
