హోరాహోరీగా జరిగిన హైదరాబాద్- రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా గెలిచిన వాణీదేవిని  సీఎం అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద తండ్రి సమాధికి వాణీదేవి నివాళులర్పించనున్నారు. 

Also Read:ఈ గెలుపు టీఆర్ఎస్‌దా.. పీవీదా, నైతిక విజయం నాదే: రామచంద్రరావు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. నువ్వానేనా అన్నట్టు కొనసాగిన మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం శనివారం తేలింది.

వాణీదేవి .. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుపై రెండో ప్రాధాన్యతా ఓటుతో విజయం సాధించారు. సురభి వాణీదేవికి మొత్తంగా 1,89,339 ఓట్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు తొలి ప్రాధాన్యత ఓట్లు 1,04,668 ఓట్లు రాగా.. 32898 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఆయనకు 1,37,566 ఓట్లు పోలయ్యాయి. ఇక స్వతంత్ర అభ్యర్ధి ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ 67,383 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.