హైదరాబాద్: ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సురభి వాణిదేవికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సురభి వాణిదేవికి శాసన మండలి చైర్ పర్సన్ గా కేసీఆర్ అవకాశం కల్పిస్తారని అంటున్నారు 

గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో శాసన మండలికి కొత్త చైర్ పర్సన్ ను ఎన్నుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆ విషయంపై టీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతమైన చర్చ సాగుతోంది. అనుభవం లేకున్నా కూడా ఆ పదవిని నిర్వహించడంలో వాణిదేవికి ఏ విధమైన ఇబ్బందులు ఉండకపోవచ్చునని అంటున్నారు. ఎన్జీవో నేతగా పనిచేసిన స్వామిగౌడ్ కు ఏ విధమైన అనుభవం లేకున్నా శాసన మండలి చైర్మన్ గా అవకాశం కల్పించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

అదే సమయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గుత్తా సుఖేందర్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా దించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకు అంగీకరిస్తారా అనేది అనుమానమే. గతంలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆయన వదులుకున్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయడానికి కూడా ఆయన ఇష్టపడకపోవచ్చునని అంటున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పుడే స్పష్టతకు వీలు కాదు. 

కాంగ్రెసు పార్టీకి చెందిన నేతనే అయినప్పటికీ కేసీఆర్ పీవీ నరసింహారావుకు ఇతోధికమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఆవరణలో ఆయన నిలువెత్తు తైలవర్ణ చిత్రపటాన్ని పెట్టేందుకు కూడా సిద్ధపడింది. హైదరాబాదు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీవీ కూతురు వాణిదేవికి పోటీ చేసే అవకాశం కల్పించి, విజయం సాధించేలా కేసీఆర్ వ్యూహరచన చేసి అమలు చేశారు. పీవీ నరసింహారావుకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి కేసీఆర్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలియంది కాదు