కారును పోలిన గుర్తులు: బీఆర్ఎస్ కు సుప్రీం షాక్, పిటిషన్ కొట్టివేత
కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది
హైదరాబాద్: కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారును పోలిన గుర్తులను తొలగించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ నిర్వహించింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ ను కొట్టివేసింది.
కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను ఈ నెల 12న బీఆర్ఎస్ వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను బీఆర్ఎస్ వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రోడ్డు రోలర్, టెలివిజన్, కుట్టు మిషన్, చపాతీ రోలర్, కెమెరా, సోప్ డిష్, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తుల కారణంగా తమ పార్టీ అభ్యర్థులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ చెబుతుంది. ఈ తరహా గుర్తులను కేటాయించవద్దని పలు దఫాలు సీఈసీకి కూడ బీఆర్ఎస్ వినతి పత్రాలు సమర్పించింది. గతంలో వచ్చిన ఎన్నికల ఫలితాలను కూడ బీఆర్ఎస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకు వచ్చారు.
ఈ నెల 3న హైద్రాబాద్ కు వచ్చిన సీఈసీ రాజీవ్ కుమార్ కు ఇదే విషయమై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం కూడా సమర్పించింది.గతంలో జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వాదిస్తుంది.రోడ్డు రోలర్, అప్పడాల కర్ర, కారుకు మధ్య ప్రజలకు తేడా తెలుస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు విషయమై చోటు చేసుకున్న వివాదం ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటుకు కారణమైన విషయం తెలిసిందే.