Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ విభజన: 7 రోజుల్లో ఏపీకి డబ్బులు చెల్లించండి.. తెలంగాణకు సుప్రీం ఆదేశం

అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ఇప్పటి వరకు నిధులు బదిలీ చేయలేదంటూ కోర్టు దృష్టికి ఏపీ తీసుకువచ్చింది.
 

supreme court key verdict on telugu academy bifurcation
Author
New Delhi, First Published Sep 15, 2021, 2:38 PM IST

ఇప్పటికే కృష్ణానదీ వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది తేలకుండానే మొన్నామధ్య విద్యుత్ బకాయిలు మరోసారి చిచ్చుపెట్టింది. తాజాగా మరో వ్యవహారం ఏపీ - తెలంగాణల మధ్య వివాదానికి దారి తీసేలా వుంది. అదే తెలుగు అకాడమీ విభజన. ఈ వివాదానికి సంబంధించిన పంచాయతీ ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద వుండటంతో బుధవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ ఇప్పటి వరకు నిధులు బదిలీ చేయలేదంటూ కోర్టు దృష్టికి ఏపీ తీసుకువచ్చింది. తాము రెండు వారాల్లో డబ్బులు బదిలీ చేస్తామని, మరికొన్ని డాక్యుమెంట్లు అందజేస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం వారం రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న స్థిరాస్తుల్లోనూ తమకు వాటా వస్తుందని ఏపీ వాదించగా.. ముందుగా చరాస్తులు, బ్యాంకు నిధుల పంపిణీ అంశాలను పరిష్కరించుకోవాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

అలాగే తెలంగాణ అకాడమీ, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అకాడమీ స్థిరాస్తులకు సంబంధించి తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తికి తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. స్థిరాస్తులు పంచాలన్న ఏపీ విధానంపై కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల పంపకంపై ఇప్పటి వరకూ పాటించిన విధానాన్ని వివరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios