హైదరాబాద్:మహిళా ఉద్యోగి నేహా చౌస్కి ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు, సీబీఐ అధికారులతో పాటు బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

2019 అక్టోబర్ మాసంలో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకొంది. తాను పనిచేసే బీహెచ్ఈఎల్ సంస్థలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా నేహా సూసైడ్ నోట్ రాసింది.దీంతో తన కూతురు ఆత్మహత్యపై సీబీఐ విచారణను కోరుతూ నేహా తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నేహా రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొన్న అంశాలను పోలీసులు ఎందుకు విచారించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.ఈ మేరకు మియాపూర్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  బీహెచ్ఈఎల్ అధికారులు, ఇతర ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారో వివరణ ఇవ్వాలని కూడ ఆదేశించింది.

ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగిపై వేధింపుల విషయంలో ఫిర్యాదు అందినా కూడ సీబీఐ ఎందుకు స్పందించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.