సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఫైనల్ అని చెప్పిన తరువాత కూడా విద్యుత్ ఉద్యోగుల నియామకం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది.
న్యూఢిల్లీ : విద్యుత్ ఉద్యోగుల నియామకం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల నియామకంపై సుప్రీం ఆదేశాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం ఆగ్రహించింది. కోర్టు ధిక్కారం కింద విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని న్యాయమూర్తులు ఎం.ఆర్.షా, కృష్ణ మురారిల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రా నుంచి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం మండిపడింది.
జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ నివేదిక ఫైనల్ అని పలుసార్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసినా.. తెలంగాణ ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయకపోవడం కోర్టు దిక్కారం అని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం ఆదేశాల అమలుకు తెలంగాణకు చివరి అవకాశం ఇచ్చింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 24 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను 31కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
మునుగోడు బైపోల్ 2022: కొత్త ఓటరు జాబితాను ప్రకటించొద్దంటూ బీజేపీ హైకోర్టులో పిటిషన్
ఇదిలా ఉండగా, పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 8న తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీరింగ్ జేఏసీ దేశవ్యాప్త విధుల బహిష్కరణ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగుల ధర్నా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.
నూతన బిల్లు ద్వారా విద్యుత్ శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉందని ఉద్యోగులు ఆరోపించారు. గతంలో తీసుకువచ్చిన చట్టాన్నే కాస్త మాజీ కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. కొత్త బిల్లుతో దేశ ప్రజలందరికీ నష్టం చేకూరుతుందని అన్నారు. విద్యుత్ సంస్థలప్రైవేటీకరణ నిలిపివేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు.
