తెలంగాణ సర్కార్‌కి సుప్రీంలో ఊరట: కాళేశ్వరం భూసేకరణ స్టేటస్ కో ఉత్తర్వుల సవరణ
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ భూ సేకరణ పనులపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చాయి.
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ భూసేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. తుది తీర్పు వచ్చేలోపుగా అనుమతులపై నిర్ణయం తీసుకొనేలా సవరణ ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. ఈ విషయమై గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి కూడా అనుమతిని ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం.
పర్యావరణ అనుమతులు , డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని చెరకు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. గత ఏడాది మూడో టీఎంసీకి చెందిన భూసేకరణ పనులపై స్టేటస్ కో విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవాళ సవరించింది.
కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించింది. గోదావరి నదిలో తెలంగాణ రాస్ట్రానికి లభించిన వాటా నీటిని వాడుకొనే క్రమంలో ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తొలిసారి అధికారం చేపట్టిన సమయంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకొంది. రాత్రి పూట కూడా పనులు నిర్వహించింది. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా మహరాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గతంలో మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్న సమయంలో కేసీఆర్ సర్కార్ మహరాష్ట్ర సర్కార్ తో ఒప్పందం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహరాష్ట్ర, ఏపీ సీఎంలను కూడా తెలంగాణ ఆహ్వాచించిన విషయం తెలిసిందే.