చంద్రబాబుకు ఐటీ ఉద్యోగుల మద్దతు.. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ..తెల్లవారుజాము నుంచే ప్రారంభం
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ చేపట్టారు. కారులతో సంఘీభావ యాత్రతో పేరుతో చేపట్టిన ఈ ర్యాలీ ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. వీరంతా రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణలోని ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు తాజా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ తీశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ ప్రారంభమైంది.
కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఎవరికి వారు తమ కార్లు తీసుకొని హైదరాబాద్ లోని గచ్చిబౌలి, ఎస్ ఆర్ నగర్, ఎల్బీనగర్ రోడ్ల ప్రాంతాల నుంచి బయలుదేరారు. వీరంతా రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు. అక్కడ శిబిరంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వీరంతా కలవనున్నారు. ఆమెకు సంఘీభావం తెలపునున్నారు.
ఇదిలా ఉండగా.. ఐటీ ఉద్యోగులు నిర్వహిస్తున్న కార్ల ర్యాలీకి పర్మిషన్ లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. కాబట్టి ర్యాలీలకు పర్మిషన్ లేదని విజయవాడ పోలీసు కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ ర్యాలీ ను అడ్డుకునేందుకు ఏపీ - తెలంగాణ బార్డర్ లో పలు చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. పోలీసుల బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి.