హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గంగుల శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బిజెపి ప్రధాన కార్యాలయం ఎదుట నిప్పంటించుకుని బలవన్మరణానికి ప్రయత్నించిన అతడు యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ(గురువారం) మరణించాడు. 

బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ అనే యువకుడు గత ఆదివారం బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని శ్రీనివాస్ నిప్పంటించుకోగా వెంటనే అక్కడున్నవారు మంటలను ఆర్పేశారు. అయినప్పటికి 40 శాతం శ్రీనివాస్ కాలిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.  

శ్రీనివాస్ ది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంగా గుర్తించారు. బండి సంజయ్ అంటే తనకు ప్రాణమని... అతడి కోసం గుండె కోసి ఇస్తానంటూ శరీరమంతా కాలిపోయిన స్థితిలో చెబుతూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగే బిజెపి కోసం ప్రాణాలు కూడ ఇస్తానంటూ పార్టీపై కూడా అభిమానాన్ని చాటుకున్నాడు. 

అతడిని మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యశోదా హాస్పిటల్ కు తరలించారు. అయినప్పటికి అతడి ఆరోగ్యం క్షీణించి గురువారం మద్యాహ్నం అతడు మృతిచెందాడు.