నందిగామ: పుట్టింటికి వెళ్లిన భార్యలను తమవద్దకు తీసుకురావాలని ఇద్దరు స్పేహితులు నాటకమాడారు. ఫూటుగా మద్యం తాగి ఒకరు ఉరేసుకుంటున్నట్లు నటించగా మరొకరు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ఇలా ఉరేసుకుంటున్నట్లు నాటకమాడి భార్యను బెదిరించాలన్న వారి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉరితాడు బిగుసుకుని ఒకరు ప్రాణాలమీదకు తెచ్చుకోగా మరొకరు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నందిగామలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన జగన్, శ్రీను స్నేహితులు. అయితే వీరిద్దరి భార్యలు కూడా పుట్టింటికి వెళ్లారు. వారిని బెదిరించి తమ వద్దకు రప్పించుకోవాలని భావించిన ఈ ఇద్దరు స్పేహితులు ఆత్మహత్య నాటకం ఆడాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలోనే ఫూటుగా మద్యం తాగిన జగన్ ఓ చెట్టుకు ఉరేసుకున్నట్లు నటిస్తుండగా శ్రీను సెల్ ఫోన్ లో వీడియో తీస్తున్నాడు. అయితే ఉరితాడు నిజంగానే జగన్ మెడను బిగుసుకుపోవవడంతో గిలగిలా కొట్టుకున్నాడు. దీంతో వీడియో తీస్తున్న శ్రీను  మరొకరి సాయంతో అతడిని కిందకు దించారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. 

ఈ  వీడియో వ్యవహారం బయటపడటంతో జగన్ తండ్రి శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. ఇలా భార్యల కోసం ఇద్దరు స్పహితుల్లో ఒకరు ప్రాణాల మీదకు తెచ్చుకోగా మరొకరు జైలుపాలయ్యాడు.